మందమర్రి,అక్టోబర్ 23(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల జిల్లా కేంద్రం మందమర్రి పట్టణంలో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్‌తో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఊరు మందమర్రి ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి వైద్యాధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లాలో అక్టోబర్ 23 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న క్యాచ్‌అప్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా టీకాలు పొందని పిల్లలను గుర్తించి, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు అందించాలని డీఎంహెచ్‌వో ఆదేశించారు. ఆరోగ్య కార్యకర్తలు తమ పరిధిలోని పిల్లల వివరాలను సిద్ధంగా ఉంచుకొని, అర్హులైన చిన్నారులందరికీ టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేను ముమ్మరం చేసి, అనుమానితులను గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలని తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాలు, దగ్గు, జలుబుతో పాటు మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీలు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణులు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్‌వోలు నామదేవ్, పుట్ట సత్తయ్య, శ్రీనివాస్, అల్లాడి శ్రీనివాస్, విజయ, మధు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

