మంచిర్యాల,అక్టోబర్ 17 (నేటి ప్రజా తెలంగాణ):ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ పరిస్థితులను సమిష్టి కృషితో ఎదుర్కోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. కరోనా మహమ్మారిని ప్రజలందరి సహకారంతో ఎదుర్కొన్నట్లుగానే, ప్రస్తుత పరిస్థితులను కూడా సమష్టిగా అధిగమించాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని సూచించారు.మంచిర్యాల నియోజకవర్గంలో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు సాగు విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు. యాసంగి పంటల సాగులో నీటి లభ్యతను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోందని వివరించారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. దివంగత కొక్కిరాల రఘుపతి రావు సేవా సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అందించే చీరలను ఈసారి సంక్రాంతి పండుగకు పది రోజుల ముందుగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల కారణంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల నగరపాలక సంస్థ మేయర్ ధర్ని మధుకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల, లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, నగరపాలక సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు సల్ల మహేష్, కార్పొరేటర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సహకార సంఘాల డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

