రామకృష్ణాపూర్,అక్టోబర్ 10(నేటి ప్రజా తెలంగాణ):చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక రకాల వ్యాధులను నివారించవచ్చని డీవైసీఎంఓ (అడ్మిన్) డాక్టర్ మధుకుమార్ తెలిపారు. రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆయన ఆధ్వర్యంలో చేతుల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ మధుకుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, స్టాఫ్ నర్సులు, వార్డు అసిస్టెంట్లు, సాంకేతిక సిబ్బంది, వంట సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరూ చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సరైన పద్ధతిలో, అవసరమైన సమయాల్లో చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని, ముఖ్యంగా అతిసార వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని వివరించారు. చేతులు కడుక్కోవాల్సిన సందర్భాలు, పాటించాల్సిన పద్ధతులపై సిబ్బందికి అవగాహన కల్పించారు.జీఎం రాధాకృష్ణ సహకారంతో, సీఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్‌కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ఇందులో సీనియర్ పీఓ మాథర్ సాహెబ్, మ్యాట్రన్ విజయకుమారి, ఓఎస్ కృష్ణమూర్తి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, యూనియన్ నాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

