మంచిర్యాల,అక్టోబర్ 9 (నేటి ప్రజా తెలంగాణ):హెచ్‌ఐవీపై ప్రజల్లో అవగాహన పెంచి, వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు బాధితుల పట్ల వివక్షను తొలగించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఐబీ చౌరస్తా వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెచ్‌ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, బాధితులకు సామాజికంగా భరోసా కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా వచ్చిన కళాజాత బృందాలతో జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఐవీ నివారణలో యువత చురుకుగా పాల్గొనాలని, సురక్షిత జీవన విధానాలు పాటించడంతో పాటు ముందస్తు పరీక్షలు, క్రమబద్ధమైన చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.జిల్లాలో ఇప్పటివరకు 2,832 హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యాయని, బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ నరేందర్ రాథోడ్ వెల్లడించారు. హెచ్‌ఐవీ నియంత్రణకు నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. బాధితులు ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, రామగుండం కేంద్రాల్లో ఏఆర్‌టీ ద్వారా చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం వల్ల శరీరంలో వైరస్ పరిమాణాన్ని నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని వివరించారు.హెచ్‌ఐవీ నివారణ కేవలం వైద్య ఆరోగ్యశాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్లో సరైన అవగాహన కల్పిస్తూ, బాధితుల పట్ల గౌరవప్రదమైన వైఖరిని పెంపొందించడం ద్వారా హెచ్‌ఐవీ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, దిశా హెచ్‌ఐవీ సమన్వయకర్త నీలిమ, వైద్య బృందం సభ్యులు కాకిరాల వెంకటేశ్వర్లు, ధూప్ సింగ్, రషీద్, ఆర్.ఎస్. పద్మ, సురేందర్, శ్రీనివాస్, స్నేహ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఐసీటీసీ కౌన్సిలర్లు, దిశా సభ్యులు సంతోష్, రాజేష్, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

