మంచిర్యాల,అక్టోబర్ 7(నేటి ప్రజా తెలంగాణ):సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. బుధవారం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ జాగ్రూకత దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు సైబర్ మోసాలు, సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సీపీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక వివరాలను బహిరంగంగా పంచుకోవద్దని సూచించారు. రైతుల నమోదు, యూరియా యాప్ డౌన్లోడ్ తదితర పేర్లతో వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించి OTP, పిన్, పాస్వర్డ్, బ్యాంకు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దన్నారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా “Pause. Think. Verify.” విధానాన్ని పాటించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా రూపొందించిన పోస్టర్‌ను సీపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ డి.వి. రంగారెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

