October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*సురక్షిత వైద్య సేవలే రోగి భద్రతకు బాట*

నస్పూర్, సెప్టెంబర్ 15 (నేటి ప్రజా తెలంగాణ): ప్రపంచ రోగి భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో, నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ కార్యక్రమాలను ప్రారంభించారు. సెప్టెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు ప్రపంచ రోగి భద్రత దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అసంక్రమణ వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, వైద్యుల సూచన మేరకు సకాలంలో మందులు వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రోగులకు సురక్షితమైన వైద్య సేవలు, సరైన సంరక్షణ అందించడం ప్రతి ఆరోగ్య సిబ్బంది బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు సత్వరంగా స్పందించి అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందించాలన్నారు.ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు కూర్చునే సౌకర్యం, తాగునీరు, గర్భిణులు, బాలింతలకు అవసరమైన సదుపాయాలు, స్ట్రెచర్లు, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రోగులను అవసరమైన సమయంలో ఇతర వైద్య కేంద్రాలకు తరలించేందుకు సిబ్బంది అందుబాటులో ఉండటంతో పాటు సమయపాలన పాటించాలని తెలిపారు. ప్రజలు ఆసుపత్రికి వెళ్లేటప్పుడు రోగితో పాటు కుటుంబ సభ్యులు లేదా బంధువులను వెంట తీసుకెళ్లాలని, వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని కోరారు.నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, రోగులతో ప్రతిజ్ఞ చేయించారు. రోగి భద్రత, సురక్షిత వైద్య సేవలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, రషీద్, సీహెచ్‌ఓలు కాకిరాల వెంకటేశ్వర్లు, పుట్ట సత్తయ్య, డీపీఓ ప్రశాంతి, రాజ్‌కుమార్, నీలిమ, వైద్యులు డాక్టర్ లక్ష్మి, డాక్టర్ వెంకటేశ్వర్లు, సీనియర్ నర్సింగ్ అధికారి కవిత, ఆరోగ్య కార్యకర్తలు వెంకట్, సునీల్, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం

మీకో దండం.. మీ పార్టీకో దండం’.. బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా..!!_*

బెల్లంపల్లి, అంబేడ్కర్ విగ్రహం వద్ద చెత్తను తక్షణం తొలగించాలని డిమాండ్

Share this