October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్*

మంచిర్యాల,అక్టోబర్ 7(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల పట్టణంలోని ప్రతిభ నర్సింగ్ హోమ్, శ్రీనివాస నర్సింగ్ హోమ్‌లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు, కేసు షీట్లను పరిశీలించి వైద్యులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రతిభ నర్సింగ్ హోమ్‌లో బాలింత రుచితకు అందించిన వైద్య సేవల వివరాలను, శ్రీనివాస నర్సింగ్ హోమ్‌లో ఘట్టమ్మకు అందించిన వైద్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ బాలింత మృతికి గల కారణాలపై సమగ్ర నివేదిక తీసుకుని, వైద్య సేవలు, కేసు షీట్లను పూర్తిగా పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు.క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో వైద్యాధికారులు, స్పెషలిస్ట్ వైద్యుల వివరాలను రోగులకు కనిపించేలా ప్రదర్శించాలని, చికిత్సలకు సంబంధించిన రుసుముల వివరాలను ఆసుపత్రిలో రెండు, మూడు ప్రాంతాల్లో స్పష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రి సిబ్బంది వివరాలు, ల్యాబ్‌లో నిర్వహించే పరీక్షలు, వాటి రుసుముల వివరాలను కూడా ప్రదర్శించాలని తెలిపారు.ప్రతి ఫార్మసీలో ఫార్మసిస్ట్ ద్వారా మందులు అందించాలని, అత్యవసర సేవలకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. వాటి వినియోగంపై ఆసుపత్రిలోని సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన కాలుష్య నియంత్రణ మండలి ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోగులతో సమన్వయం చేసుకుంటూ వారికి కౌన్సెలింగ్ అందించాలని, గర్భిణులకు తగిన వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ తనిఖీలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డాక్టర్ వెంకట సాయి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రతిభ, డాక్టర్ రఘువంశీ పాల్గొన్నారు.

Related posts

*అంజనీపుత్రపై కుట్రలకు చెక్‌.. ఫేక్ ప్రచారాలపై ఫైర్ “తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు”: చైర్మన్ గుర్రాల శ్రీధర్*

*బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య*

మాదిగ హక్కుల దండోరా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులుగా కాంపల్లి సతీష్ మాదిగ*

Share this