October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ: జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్*

మంచిర్యాల,అక్టోబర్ 7(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల జిల్లాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్ కుమార్‌తో కలిసి కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గంగిపెల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రాల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించడంతో పాటు సిబ్బందితో కలిసి గంగిపెల్లి కేంద్రం పరిసరాలను శుభ్రం చేశారు. కుందారం పీహెచ్‌సీలో జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు.డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి 31 వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి జ్వరాల లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించడంతో పాటు 30 ఏళ్లు పైబడిన వారికి రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అర్హులైన పిల్లలకు టీకాలు అందేలా, గర్భిణుల నమోదు 100 శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గంగిపెల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై డీఎంహెచ్‌ఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, వైద్యులు డాక్టర్ శ్రావ్య, డాక్టర్ వేదశ్రీ, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక.. సత్ప్రవర్తనతో జీవించాలని సూచన:ఎస్.ఐ జె.శ్రీధర్

*అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు: మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ*

*రాళ్లవాగు వంతెన పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి*

Share this