మంచిర్యాల,జులై 28:ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో హెపటైటిస్ వ్యాధులపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మాతా–శిశు సంరక్షణ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో హెపటైటిస్ వ్యాధులపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.హెపటైటిస్ అనేది కాలేయాన్ని ప్రభావితం చేసే వైరల్ వ్యాధి అని, హెపటైటిస్ A, B, C, D, E వైరస్‌ల ద్వారా సంక్రమిస్తుందని వివరించారు. కలుషిత రక్తం, వినియోగించిన సూదులు, తల్లి నుంచి శిశువుకు, కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని వెల్లడించారు.హెపటైటిస్‌ను మౌన వ్యాధిగా పేర్కొంటూ, ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోయినా కాలేయానికి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. వ్యాధి తీవ్రత పెరిగితే జీర్ణక్రియ దెబ్బతిని కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశముందని తెలియజేశారు.మత్తు పదార్థాల వినియోగం, మద్యపానం, అనారోగ్యకర జీవనశైలి, వ్యక్తిగత పరిశుభ్రత లోపం కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా డిస్పోజబుల్ సిరంజీలనే వినియోగించాలని, శస్త్రచికిత్సలు, రక్త మార్పిడికి ముందు అవసరమైన పరీక్షలు నిర్వహించాలని సూచించారు.సకాలంలో పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందడం, హెపటైటిస్-బి టీకా తీసుకోవడం ద్వారా వ్యాధిని సమర్థంగా నివారించవచ్చని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి హెపటైటిస్-బి వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు వెల్లడించారు.ప్రజలు హెపటైటిస్‌పై అవగాహన పెంచుకొని అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు తమ పరిధిలో హెపటైటిస్ పరీక్షలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకుడు డాక్టర్ అశోక్, డాక్టర్ శ్రీధర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైరల్ హెపటైటిస్ జిల్లా కోఆర్డినేటర్ మధు, సీహెచ్‌వోలు పుట్ట సత్తయ్య, కాకిరాల వెంకటేశ్వర్లు, నామ్‌దేవ్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, డాక్టర్ అమన్, డాక్టర్ రమ్య, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

