మంచిర్యాల, ఆగస్టు 19(నేటి ప్రజా తెలంగాణ): ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో రుచికరమైన, పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు.బుధవారం మంచిర్యాల పట్టణంలోని కేంద్ర వంటశాలను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, అసిస్టెంట్ కమిషనర్‌లతో కలిసి సందర్శించిన అదనపు కలెక్టర్, వివిధ విద్యాసంస్థలకు అల్పాహారం, జూనియర్ కళాశాలలకు మధ్యాహ్న భోజనం పంపిణీకి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్, అక్షయ పాత్ర ఫౌండేషన్, మన్నా ట్రస్ట్ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయానికి సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం నూతన ప్రభుత్వ ఆసుపత్రిలోని బిఈఆర్‌ఎ గదిని ఆర్‌ఎంఓ, ఈఎన్‌టి వైద్య నిపుణులు, డీఆర్‌డీఏ సదరం అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యలను సంబంధిత గుత్తేదారుతో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని, అవసరమైన పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి సేవలు సక్రమంగా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.తదుపరి విద్యాశాఖ సమన్వయంతో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం నిర్వహిస్తున్న సదరం ప్రత్యేక శిబిరాన్ని సందర్శించి ఏర్పాట్లు, పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవసరమైన ధ్రువపత్రాలు, వైద్యపరమైన అంచనాలు, ఇతర సేవలు సులభంగా, సకాలంలో అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శిబిరాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

