కన్నెపల్లి,జూలై 27 (నేటి ప్రజా తెలంగాణ):
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్లో ఉన్న కన్నెపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ దేవయ్య, ఎస్ఐ విక్రమ్ పుష్పగుచ్ఛం అందించి డీసీపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం డీసీపీ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు.తనిఖీల సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన డీసీపీ, రిసెప్షన్ సెంటర్లోని సిబ్బందితో మాట్లాడి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ రైటర్, సీసీటీఎన్ఎస్ రైటర్లతో సమావేశమై కేసుల ఆన్లైన్ నమోదు, వివరాల అప్లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు. పెండింగ్ కేసుల ఫైళ్లు, క్రైమ్ రికార్డులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ వ్యవహారాలపై సీఐ దేవయ్య, ఎస్ఐ విక్రమ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డీసీపీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి సీసీ కెమెరాల ఫుటేజీని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడంతో పాటు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం రాత్రివేళల్లో పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారికి వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.ఈ తనిఖీల్లో ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ దేవయ్య, ఎస్ఐ విక్రమ్‌తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

