మంచిర్యాల, ఆగస్టు 7: ప్రపంచ తల్లి పాల వారోత్సవాల ముగింపు సందర్భంగా లయన్స్ క్లబ్ హైటెక్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల నగరంలోని హమాలీవాడ మొదటి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రముఖ విద్యావేత్త గుండేటి యోగీశ్వర్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిశువు జన్మించిన తొలి గంటలోనే ముర్రుపాలు అందించడం అత్యంత అవసరమని, తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. అనంతరం పిల్లల వైద్యుల సలహా మేరకు రెండేళ్ల వయస్సు వరకు తల్లి పాలివ్వడం కొనసాగించాలని పేర్కొన్నారు.తల్లి పాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయని తెలిపారు. అలాగే తల్లులకు రొమ్ము క్యాన్సర్, ఊబకాయం, టైప్-2 మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో తల్లి పాలివ్వడం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.అనంతరం లయన్స్ క్లబ్ హైటెక్ కార్యదర్శి చెట్ల రామయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని గర్భిణీలు, బాలింతలకు పండ్ల పంపిణీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ హైటెక్ అధ్యక్షుడు రాజు పటేల్, కార్యదర్శి చెట్ల రామయ్య, క్యాబినెట్ సభ్యులు సి.హెచ్. హన్మంతరావు, తిరుపతి, నరోత్తమరావు, అంగన్‌వాడీ టీచర్లు రమాదేవి, ఈశ్వరమ్మతో పాటు హమాలీవాడకు చెందిన తల్లులు, గర్భిణీలు పాల్గొన్నారు.

