హాజీపూర్, ఆగస్టు 6: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం క్రమశిక్షణతో కష్టపడి చదవాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ సూచించారు.మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను ఆయన సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న విద్యా, వసతి, భోజన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించే దిశగా నిరంతరం శ్రమించాలని, ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే క్రమశిక్షణతో సిద్ధం కావాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి, వారితో కలిసి క్రీడల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి భవిష్యత్తు లక్ష్యాలు, ఆశయాలను తెలుసుకుని పలు విలువైన సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శిరీష, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

