మంచిర్యాల,ఆగస్టు 7:ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ గురుకుల పాఠశాలలలో సకల సదుపాయాలు కల్పించి సుశిక్షితులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన బోధన అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2025-26 సంవత్సరపు ర్యాంకులలో మంచిర్యాల జిల్లా 2వ స్థానం సాధించిన సందర్భంగా జిల్లాలోని పాఠశాలలో అవలంబించిన ఉత్తమ ఆచరణలు, పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ర్యాంక్ మెరుగవ్వడానికి దోహదపడిన అంశాలు, స్కూల్ సేఫ్టీ & సెక్యూరిటీ డొమైన్ అంశాల అమలు తీరు, ఇతరత్రా పరిశీలించడం కొరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్, జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) పి.శ్రీజ, జిల్లా విద్యాధికారి జి.సదానందం ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా విద్యాశాఖ తరపున వచ్చిన ఖమ్మం అర్బన్ మండల విద్యాధికారి కె.వి. శైలజ లక్ష్మి, ఖమ్మం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం సెక్టోరల్ అధికారిని వి.రూబీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల- రాజేంద్రనగర్ ప్రధానోపాధ్యాయురాలు కె.గాయత్రి లు శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లో గల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, హాజీపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ఇతర పాఠశాలలను సందర్శించి పాఠశాలలలో అమలవుతున్న ఉత్తమ ఆచరణలను పరిశీలించి మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి.చంద్రయ్యతో కలిసి జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సకల సదుపాయాలు కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని, జిల్లా, మండల అధికారుల సమన్వయంతో పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించి పాఠశాలలలో పరిస్థితులను పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి పాఠశాలలలో అవసరమైన సౌకర్యాలు, విద్యార్థుల పురోభివృద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం విద్యార్థుల చేరికలు ప్రభుత్వ పాఠశాలలలో 4 శాతం ఉండగా ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు 6.5 శాతంగా ఉందని, 8 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దాదాపు 4 వేలమంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలలో చేరారని తెలిపారు. ప్రతిరోజు 75 నుండి 80 శాతం విద్యార్థుల హాజరు నమోదు అవుతుందని, 90 శాతానికి పెంచేదిశగా చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థుల గైర్హాజరుపై వారి తల్లిదండ్రులతో సమీక్షించి విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చేలా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గం వారిగా ఉపాధ్యాయులతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు తమ సెలవుకు సంబంధించిన పత్రాన్ని ఆ గ్రూప్ లో పోస్ట్ చేసేలా చర్యలు తీసుకున్నామని, పాఠశాలల సందర్శన సమయంలో ఉపాధ్యాయులు గ్రూప్ లో సెలవు పత్రం పోస్ట్ చేయకుండా విధులకు గైర్హాజరు అయినట్లయితే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆదివాసి పిల్లలు పాఠశాలలకు వచ్చేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, నాణ్యమైన ఆహారం క్రమం తప్పకుండా అందించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లా విద్యారంగంలో ముందంజలో ఉండటంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

