పెద్దపల్లి,ఆగస్టు 4: మహిళల భద్రత, సైబర్ మోసాలు, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల నివారణపై మహిళలకు అవగాహన కల్పించేందుకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లిలోని వీ-హబ్ శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులు వ్యక్తిగత భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ప్రభావం, ఆన్లైన్ మోసాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్ బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాల్లో నిరంతరం నిఘా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. మహిళలు లేదా విద్యార్థినులను ఎవరైనా వేధింపులకు గురిచేస్తే భయపడకుండా షీ టీమ్ 6303923700 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు, సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు ప్రయాణాలను మరింత సురక్షితంగా చేసుకునేందుకు టి-సేఫ్ యాప్‌ను వినియోగించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక, స్నేహలతతో పాటు వీ-హబ్ శిక్షణ కేంద్రం సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

