October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*మంచిర్యాల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి*

మంచిర్యాల,అక్టోబర్ 27(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం, పంటలు సాగు చేయని రైతులకు ఎకరాకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించాలని అఖిల భారత రైతు-కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ. లాల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా లాల్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి సమస్యలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయ పనులు తగ్గడంతో కూలీలు, గ్రామీణ పేదలకు ఉపాధి కరువవుతోందని తెలిపారు. పత్తి, వరి పంటలకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన రైతులకు పరిహారం అందించాలని కోరారు.జిల్లాలో వర్షపాతం, సాగు విస్తీర్ణం, భూగర్భ జలాలు, సాగునీటి లభ్యతపై సమగ్ర పరిశీలన చేపట్టాలని, రైతులకు సరిపడా విద్యుత్తు సరఫరా చేయాలని, అవసరమైన రుణ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు విస్తృతంగా కల్పించడంతో పాటు కూలి చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులకు మేత, నీటి సదుపాయాలు కల్పించి పశుసంపదను కాపాడాలని కోరారు.ప్రభుత్వం రైతులు, గ్రామీణ ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని లాల్ కుమార్ అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పంట నష్టపోయిన రైతులను సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు-కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దొండ ప్రభాకర్, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి బ్రహ్మానందం, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగ, అరుణోదయ రాష్ట్ర కోశాధికారి వి. మల్లన్న, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఎం. జ్యోతి, రైతు-కూలీ సంఘం జిల్లా నాయకులు రెడ్డి పోచన్న, చంద్రన్న, సమ్మన్న, సురేందర్, రమేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

డాక్టర్ ఏ సందర్భంగా గవర్నమెంట్ డాక్టర్లకు సన్మానించిన బీఎస్పీ నాయకులు

*సైబర్ నేరాల కట్టడిలో సైబర్ వారియర్స్ కీలక పాత్ర: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ*

Share this