October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*చెన్నూర్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత: మంత్రి వివేక్ వెంకటస్వామి*

చెన్నూర్,అక్టోబర్ 26 (నేటి ప్రజా తెలంగాణ):చెన్నూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం చెన్నూర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం సుమారు రూ.70 కోట్ల నిధులు మంజూరయ్యాయని, రహదారుల విస్తరణ, మురుగు కాలువలు, వీధి దీపాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ రహదారుల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యల పరిష్కారం, తాగునీటి సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అనంతరం జైపూర్ మండలం వేలాల గ్రామంలో గోదావరి తీరాన రూ.4.25 కోట్లతో నిర్మించనున్న పుష్కర ఘాట్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో పర్యాటక రంగ అభివృద్ధికి మొసళ్ల పార్కు, గాంధారి మైసమ్మ ఆలయం తదితర ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. చెన్నూర్‌లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని, మందమర్రిలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గంలో 12 వేల నుంచి 15 వేల ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న అటవీశాఖ దాడులు*

అరుదైన “మే పుష్పం”తో ఆకట్టుకుంటున్న గుండేటి యోగేశ్వర్ ప్రకృతి మిత్ర నిలయం

“వేధింపులకు చెక్.. మహిళల రక్షణకు షీ టీమ్స్ అప్రమత్తం”_షీ టీం ఎస్ఐ ఉషారాణి

Share this