October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*పోలీసుల విధులు, బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన*

రామకృష్ణాపూర్,అక్టోబర్ 25(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన 60 మంది విద్యార్థులకు పోలీసుల విధులు, బాధ్యతలు, ప్రజా రక్షణలో వారి పాత్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 21న నిర్వహించిన పోలీస్ అమరవీరుల దినోత్సవం నేపథ్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పోలీస్ వ్యవస్థ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలను విద్యార్థులకు వివరించారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రజల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తూ, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ఆపదలో ఉన్నవారికి సహాయం అందించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రజల ప్రాణాల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. విద్యార్థులు చట్టాలను గౌరవిస్తూ, నియమ నిబంధనలు పాటించాలని, క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతాయుత ప్రవర్తనను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. బాలబాలికలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య లేదా ఆపద ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పోలీస్ వ్యవస్థపై అవగాహన పెంపొందించడంతో పాటు, పోలీసుల పట్ల గౌరవభావం, సమాజం పట్ల బాధ్యతను పెంపొందించేలా చర్యలు చేపట్టారు. విద్యార్థులు భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగిన మంచి పౌరులుగా ఎదిగి దేశ అభివృద్ధికి తోడ్పడాలని పోలీసులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జె. శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Related posts

*తల్లిపాలే శిశువుకు తొలి టీకా, తొలి ఆహారం: డీఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్*

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్ సేవల విస్తరణ – కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభం

నూతన కార్మిక నిబంధనలకు కేంద్రం ఆమోదం

Share this