మంచిర్యాల, అక్టోబర్ 10 (నేటి ప్రజా తెలంగాణ): సామూహిక అత్యాచారం కేసులో నేరం రుజువు కావడంతో నలుగురు నిందితులకు కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. వీరికి కలిపి రూ.11 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి ఆడెపు నీరజ తీర్పు వెలువరించారు.మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలానికి చెందిన బాధితురాలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో పనిచేసేది. 2017 మార్చి 10న పద్మ అనే నిందితురాలు బాధితురాలిని నమ్మించి మార్కెట్కు తీసుకెళ్లి, అనంతరం ఓ బెల్ట్ షాపులో మద్యం తాగించింది. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిన సమయంలో ఇతర నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు 2017 ఏప్రిల్ 13న సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి పోలీసు అధికారుల పర్యవేక్షణలో నిందితులను అరెస్టు చేసి, న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నలుగురికీ శిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. కృష్ణమూర్తి కేసు విచారణలో సమర్థవంతంగా వాదనలు వినిపించారు.కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. పెద్దపల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి, ఏసీపీ జి. కృష్ణ పర్యవేక్షణలో సాక్షులను న్యాయస్థానంలో హాజరుపరచడంలో కృషి చేసిన సుల్తానాబాద్ సీఐ పొన్నమనేని రంజిత్ రావు, ఎస్ఐ పెట్టెం చంద్రకుమార్, కోర్టు కానిస్టేబుల్ వాసాల శ్రీనివాస్, లైజన్ అధికారి వోడ్నాల తిరుపతి రావు, ఏఎస్సై-227లను ప్రత్యేకంగా అభినందించారు.
previous post

