జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి ప్రజా తెలంగాణ:ఏప్రిల్ 11
వివిధ వ్యాధుల నియంత్రణకు వైద్యులు సూచించిన విధంగా మాత్రమే మందుల దుకాణాల నిర్వాహకులు మందులు విక్రయించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చందన, ఈగల్ ఫోర్స్ సి.ఐ. రవికుమార్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు చంద్రశేఖర్, సుధాకర్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మందుల దుకాణాల నిర్వాహకులు, వైద్యులు సూచించిన ప్రస్క్రిప్షన్ ప్రకారం మాత్రమే ప్రజలకు మందులను విక్రయించాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని, నిష్ణాతులైన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రజలు సొంత ఆలోచన ప్రకారం మందులు, సిరప్ లు వినియోగించకూడదని, వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు మందులు వినియోగించాలని తెలిపారు. నార్కోటిక్, నిషేధిత డ్రగ్స్ విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, మందుల విక్రయంలో మందుల దుకాణాల నిర్వాహకులు సమిష్టిగా ఉండాలని, సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులను విక్రయించకూడదని తెలిపారు. మందుల షాపుల నిర్వాహకులు సరైన అర్హత, అనుమతి తప్పనిసరిగా కలిగి ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో 7 పడకలతో ఏర్పాటు చేసిన డ్రగ్స్ డి – అడిక్షన్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు వేదవ్యాస్, ఆర్.ఎం.ఓ. భీష్మ, వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఈ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఐ.టి.ఐ., ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థులకు మత్తు పదార్థాలు, మద్యం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, అధ్యాపకులు, తల్లితండ్రులు పిల్లల ప్రవర్తనలో కలిగే మార్పులపై పర్యవేక్షించాలని, ప్రవర్తన మారిన పిల్లలను డి అడిక్షన్ సెంటర్ కు తీసుకురావాలని తెలిపారు. ఈ సెంటర్ నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందని, స్వచ్ఛంద సంస్థలు డ్రగ్స్ నియంత్రణపై అధికారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయం అంశాలపై హెల్ప్ లైన్ నంబర్లు 14416, 1908 లలో సమాచారం అందించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులతో తాము జీవితంలో ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు డా. సునీల్ కుమార్, డా. కిరణ్ కుమార్, నర్సింగ్ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

