రామకృష్ణాపూర్,సెప్టెంబర్ 15(నేటి ప్రజా తెలంగాణ):విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ 5వ వార్డులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు షేర్ ద విజన్–ఖమ్మం సంస్థ ప్రతినిధి పి. నారాయణ అందించిన వాటర్ బాటిళ్లు, నోట్ పుస్తకాలు, క్రీడా సామగ్రితో కూడిన కిట్లను మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, షేర్ ద విజన్ సంస్థ ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. పాఠశాలలో రూఫింగ్ పనుల కోసం డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ.30 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రమైన తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు, సౌందర్య సాధనాల ఖర్చులు, క్రీడా సామగ్రి తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించేందుకు మెస్ చార్జీలను 40 శాతం పెంచినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. చెన్నూర్ మండలం సోమనపల్లిలో సుమారు రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. చెన్నూర్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల నమోదు పెరిగిందని తెలిపారు. సోమనపల్లిలో సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.100 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు నాణ్యమైన ఆహారం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. సొంత భవనాలు లేని పాఠశాలలకు భవనాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని, ఇదే స్థాయిని కొనసాగించేలా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, షేర్ ద విజన్ సంస్థ ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
next post

