నస్పూర్, సెప్టెంబర్ 14(నేటి ప్రజా తెలంగాణ):టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్లో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక బంకమట్టి మహాగణపతిని వైభవంగా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఎన్జీవో కాలనీకి చెందిన నాయకులు, మహిళలు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథునికి పూజలు చేశారు.ఈ సందర్భంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ బంకమట్టి గణపతులను ఏర్పాటు చేసి పూజించాలని సూచించారు. బంకమట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు చెరువులు, నదుల్లో నిమజ్జనం చేసినా నీటి వనరులకు హాని కలగకుండా ఉంటుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణహిత పద్ధతులను పాటించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగంతో పర్యావరణానికి నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రకృతి మిత్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వ పర్యావరణ అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో పర్యావరణ కాలుష్యం తీవ్రతరం అవుతోందన్నారు. వినాయక చవితి సందర్భంగా బంకమట్టి మహాగణపతులను పూజించడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు దూరంగా ఉండాలని సూచించారు. పూజా కార్యక్రమాల్లో మహిళలు సైతం ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా స్టీల్ పాత్రలు, ఆకుదొప్పలు ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, సొసైటీ నాయకులు పుప్పాల హనుమంతరావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, సైండ్ల మొండయ్య, నాగేశ్వరరావు, తిరుపతిరెడ్డి, సునీత, లక్ష్మీ రాజయ్య, మల్లికార్జున్, ఉపాధ్యక్షుడు తిరుపతి, ఎన్. సత్యనారాయణతో పాటు టీఎన్జీవో కాలనీ నాయకులు, మహిళలు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
previous post

