మంచిర్యాల/పెద్దపల్లి,సెప్టెంబర్ 12 (నేటి ప్రజా తెలంగాణ): జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో మొత్తం 5,261 కేసులు పరిష్కరించబడ్డాయి. రాజీకి వీలైన కేసులతో పాటు ఈ-చలాన్, మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు ఇందులో ఉన్నాయి.దర్యాప్తులో ఉన్న, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న రాజీకి వీలైన కేసుల్లో 613 భారతీయ శిక్షాస్మృతి కేసులు, ప్రత్యేక చట్టాలకు సంబంధించిన 36 కేసులు పరిష్కరించగా, 2,872 ఈ-చలాన్ కేసులు, 1,740 మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు పరిష్కారమయ్యాయి.అదేవిధంగా 125 సైబర్ నేర కేసుల్లో బాధితులకు రూ.33,65,739 తిరిగి అందజేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 123 సైబర్ నేర కేసుల్లో బాధితులకు రూ.27,58,843, సీసీపీఎస్ పోలీస్ స్టేషన్, రామగుండంలో నమోదైన రెండు కేసుల్లో బాధితులకు రూ.6,06,896 తిరిగి అందజేశారు.ఈ వివరాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా చిన్నపాటి నేరాలు, ట్రాఫిక్, ఎక్సైజ్, మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు వేగంగా పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంతో ప్రజలకు సమయం, ధనం ఆదా అయ్యాయని తెలిపారు.కేసుల పరిష్కారానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించారని, పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. గత 15 రోజులుగా పోలీస్ కమిషనరేట్ అధికారులు, న్యాయస్థాన సిబ్బంది కేసుల్లోని పక్షాలను స్వయంగా కలిసి రాజీ మార్గం ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని అవగాహన కల్పించినట్లు తెలిపారు. దీంతో నిర్దేశించిన లక్ష్యానికి మించి కేసులను పరిష్కరించగలిగామని పేర్కొన్నారు.లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. కేసుల పరిష్కారాన్ని నిరంతరం పర్యవేక్షించి కృషి చేసిన సిబ్బందికి త్వరలో పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ సహకరించిన రెండు జోన్ల న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవా సంస్థలకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

