September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*వర్షంలోనూ దేశభక్తిని చాటిన కలెక్టరేట్ ఏరియా హెల్త్ క్లబ్ వాకర్స్*

మంచిర్యాల,ఆగస్టు 15(నేటి ప్రజా తెలంగాణ):దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఏరియా హెల్త్ క్లబ్ వాకర్స్ వినూత్నంగా దేశభక్తిని చాటారు. ఉదయం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ముందుగా నిర్ణయించుకున్న సమయానికి జాతీయ జెండాలతో కార్యక్రమాన్ని నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు.కలెక్టరేట్ ఏరియా హెల్త్ క్లబ్ వాకర్స్ ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉదయం 7 గంటలకు జాతీయ జెండాల ప్రదర్శన, దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. అయితే అదే సమయంలో భారీ వర్షం కురవడంతో పలువురు వాకర్స్ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అయినప్పటికీ కొందరు వాకర్స్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్యక్రమాన్ని కొనసాగించారు.దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకుంటూ ‘భారత్ మాతాకీ జై’, ‘జై జవాన్.. జై కిసాన్’, ‘ఆవాజ్ దో.. హమ్ ఏక్ హై’ వంటి దేశభక్తి నినాదాలతో వాతావరణాన్ని మార్మోగించారు. ప్రతికూల వాతావరణంలోనూ కార్యక్రమాన్ని కొనసాగించడం ద్వారా నిజమైన దేశభక్తికి వారు ప్రతీకగా నిలిచారు.విశ్రాంత ఆర్మీ, ఎన్‌సీసీ అధికారి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ ముఖ్య బాధ్యులు కస్తూరి నాగేశ్వర్, చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గమనించిన పోలీసు అధికారి సురేష్ బాబు కూడా వాకర్స్‌తో కలిసి దేశభక్తి నినాదాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అంతేకాకుండా కాలనీలోని చిన్నారులను సైతం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగస్వాములను చేశారు. చిన్నారులను సైనికుల దుస్తుల్లో అలంకరించి, వారి చేతికి జాతీయ జెండాలు అందించి దేశభక్తి భావాలను పెంపొందించేలా ప్రోత్సహించారు.వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశభక్తితో నిర్వహించిన కలెక్టరేట్ ఏరియా హెల్త్ క్లబ్ వాకర్స్‌ను పలువురు అభినందించారు.

Related posts

*మొక్కలు నాటి సంరక్షిస్తేనే భవిష్యత్ పర్యావరణ పరిరక్షణ*

బట్వాన్పల్లిలో టిడిపి అభ్యర్థిగా రామటంకి హరిబాబు బరిలో

Share this