మంచిర్యాల,ఆగస్టు 3: మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాముని చెరువు ప్రాంతంలో మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్లతో కలిసి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాముని చెరువు సుందరీకరణకు నిధులు మంజూరు చేసి పనులు చేపడుతున్నామని, పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం, వాకింగ్‌కు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్‌లో సమతుల్య వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కాలుష్య నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలని, గతంలో అడవుల జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో తగ్గిన అటవీ శాతాన్ని తిరిగి పెంచేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.అనంతరం హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామపంచాయతీ పరిధిలో వి.బి.జి. రామ్‌జీ పథకంలో భాగంగా రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఫామ్ పాండ్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్‌లో ఏర్పడే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, ఊట కుంటల ఏర్పాటుతో భూగర్భ జలాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షపు నీరు వృథా కాకుండా ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, కుంటల ద్వారా నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించాలని సూచించారు. రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు.అనంతరం కర్ణమామిడి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన విత్తన మేళలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు, గోదావరిలో నీటి లభ్యత తగ్గడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయని తెలిపారు. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పత్తి, పప్పుధాన్యాలు, ఆయిల్‌పామ్ వంటి తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. నీటి లభ్యతను అంచనా వేసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని, నానో డీఏపీ, నానో యూరియాను అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకట్ రెడ్డి, ఆత్మ చైర్మన్ మురళి, గ్రామ సర్పంచ్ బొడ్డు భూమన్న, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
previous post

