మంచిర్యాల, ఆగస్టు 8: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ, రైతులకు ఎలాంటి నష్టం కలుగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్‌తో కలిసి వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులతో వర్షపాతం, సాగునీటి లభ్యత, పంటల సాగు, పంటల వైవిధ్యీకరణ, రైతుల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిలో మొదటి ప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలని, నీటి వృథాను పూర్తిగా నివారిస్తూ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను రైతులు సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులను నేరుగా కలిసి పంటల వైవిధ్యీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని, అధిక నీటి అవసరం ఉన్న పంటల సాగుతో కలిగే నష్టాలను ముందుగానే తెలియజేయాలని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలు, కూరగాయల సాగును ప్రోత్సహించడంతో పాటు మార్కెట్ పరిస్థితులు, కనీస మద్దతు ధర వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.రైతుల సమస్యలు, సాగునీటికి సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని, నీటి విడుదల, కాలువల నిర్వహణ, పంటల సాగులో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. రైతులకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ..ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో నీటి ప్రతి బొట్టును పొదుపుగా వినియోగించాలని, ఎక్కడా నీటి వృథా జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతు ప్రయోజనమే ప్రధాన లక్ష్యంగా అధికారులు నిష్పక్షపాతంగా, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.కర్ణమామిడి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఫామ్ పాండ్‌ను రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కడెం రిజర్వాయర్ నుంచి ఆదివారం ఉదయం నీటిని విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.అదేవిధంగా ఈ నెల 15వ తేదీ నుంచి నూతన చేయూత పింఛన్ల జారీ ప్రక్రియ, నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రైతులకు నీటి లభ్యత, పంటల వైవిధ్యీకరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మార్కెట్ పరిస్థితులపై నిరంతరం అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీల చైర్మన్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు, ఏఈలు, డీఈలు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
previous post

