July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*వ్యాపార భద్రతకు సీసీ కెమెరాలే కీలకం: బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్*

బెల్లంపల్లి,జులై 7:రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులకు సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రాముఖ్యత,స్వీయ రక్షణ, వ్యాపార భద్రత చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.బెల్లంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “నేను సైతం” కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో సమాజంలో శాంతిభద్రతలు, భద్రతా ప్రమాణాల బలోపేతానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రజల రద్దీ అధికంగా ఉండే వాణిజ్య సంస్థలు, వ్యాపార సముదాయాలు, షాపింగ్ కేంద్రాలు, దుకాణాలు, కార్యాలయాలు, గోదాములు, నివాస ప్రాంతాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం నేటి పరిస్థితుల్లో అత్యంత అవసరమని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా దొంగతనాలు, ఇతర నేరాలను నివారించడంతో పాటు, నేరాలు జరిగినప్పుడు నిందితులను త్వరితగతిన గుర్తించేందుకు వీడియో దృశ్యాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.పబ్లిక్ సేఫ్టీ చట్టం ప్రకారం ప్రజల రద్దీ అధికంగా ఉండే వాణిజ్య సంస్థల్లో సీసీ కెమెరాలతో పాటు యాక్సెస్ కంట్రోల్, పార్కింగ్ భద్రత, భద్రతా సిబ్బంది వంటి ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.అలాగే సీసీ కెమెరాల దృశ్యాలను కనీసం 30 రోజుల పాటు భద్రపరచాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా వ్యాపారులపై అదనపు భారం మోపడం పోలీసుల ఉద్దేశం కాదని, వారి వ్యాపారాల భద్రతతో పాటు ప్రజల రక్షణ కోసమే ఈ చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.ఇంకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని వ్యాపారులు వారంలోపు తమ దుకాణాల ముందు రహదారి స్పష్టంగా కనిపించేలా కనీసం ఒక నాణ్యమైన సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నగదు లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని,అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 లేదా 112 సేవలను వినియోగించాలని కోరారు.ప్రజల భాగస్వామ్యంతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని, ప్రతి వ్యాపారి ప్రజా భద్రతలో భాగస్వామిగా వ్యవహరించి నేరాల నియంత్రణకు సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది,వ్యాపార సంఘాల ప్రతినిధులు,పట్టణంలోని పలువురు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*బొక్కలగుట్టలో 12 సీసీ కెమెరాల ఏర్పాటు – గ్రామ భద్రతకు పోలీసుల ముందడుగు*

విశ్వకర్మలకు ప్రత్యేక పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలి*

Chief Editor: Satish Kumar

*హత్యాయత్నం కేసులో రౌడీ షీటర్ A1 గణేష్ అరెస్ట్.. కత్తి స్వాధీనం*

Share this