September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి :రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా*

నస్పూర్, సెప్టెంబర్ 7 (నేటి ప్రజా తెలంగాణ): జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా అన్నారు.సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీలతో కలిసి ఏఈఆర్‌ఓలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఐఆర్-2026లో భాగంగా జిల్లాలో 1 లక్షా 70 వేల మ్యాపింగ్ కాని, అనమోలీస్ ఓటర్లకు సంబంధించి నోటీసులు జనరేట్ చేయగా, ఇప్పటికే 1 లక్షా 10 వేల నోటీసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 60 వేల నోటీసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.జిల్లాలో ముగ్గురు ఈఆర్‌ఓలు, 18 మంది ఏఈఆర్‌ఓలు, అదనంగా కేటాయించిన 18 మంది ఏఈఆర్‌ఓలు ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన క్లెయిమ్స్, అబ్జెక్షన్ల ప్రక్రియపై పనిచేస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, నోటీసులు అందుకున్న వారు సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించేలా అవగాహన కల్పించాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన 11 డాక్యుమెంట్లలో నుంచి మాత్రమే పత్రాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.నో మ్యాపింగ్, అనమోలీస్, ఏఎస్‌డీ జాబితాలను సంబంధిత బూత్ స్థాయి ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లకు నోటీసుల జారీ, డాక్యుమెంట్ల సమర్పణ తదితర అంశాలపై మరోసారి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన యోగితా రాణా ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లకు నియమ నిబంధనలపై శిక్షణ నిర్వహించాలని, ప్రతిరోజూ ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ప్రత్యేక సమయం కేటాయించాలని సూచించారు. కమ్యూనిటీ సర్టిఫికెట్లను నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అంతకుముందు నస్పూర్‌లోని సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న యోగితా రాణాను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం నస్పూర్‌లోని 250, 251, 252, 253 పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం__99 రోజుల ప్రజాపాలనలో సాయి కుంట బస్తీ దవాఖానలో ప్రత్యేక వైద్య పరీక్షలు

Chief Editor: Satish Kumar

ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు కొత్త ఎత్తుగడ

ప్రభుత్వ అవకాశాలతో పిల్లలు ఉన్నత శిఖరాల దిశగా ఎదగాలి: మేయర్ మధుకర్

Chief Editor: Satish Kumar
Share this