క్యాతనపల్లి,సెప్టెంబర్ 5(నేటి ప్రజా తెలంగాణ):క్యాతనపల్లి పురపాలక సంఘం పరిధిలో ఇంటి నిర్మాణాలు, వాణిజ్య భవనాల నిర్మాణాలు చేపట్టే వారు తప్పనిసరిగా పురపాలక సంఘం నుంచి ముందస్తు అనుమతులు పొందాలని మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ సూచించారు. అనుమతిలో పేర్కొన్న నిబంధనలు, షరతులకు లోబడి మాత్రమే నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.భవన నిర్మాణాల సమయంలో తప్పనిసరిగా వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే గుంతలను ఏర్పాటు చేయడంతో పాటు, నిర్మాణ అనుమతుల్లో నిర్దేశించిన మేరకు ఖాళీ స్థలాన్ని తప్పనిసరిగా వదిలి నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు.అదేవిధంగా ప్రధాన రహదారులు, ఇతర రోడ్లకు ఆనుకొని అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన షెడ్లు, ఇతర నిర్మాణాలను దుకాణ యజమానులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని పురపాలక సంఘం సూచించింది. రహదారులు, రహదారి పక్క ప్రాంతాలను ఆక్రమించి దుకాణాలు నిర్వహించడం వల్ల వాహనదారులు రోడ్లపైనే వాహనాలను నిలిపివేయాల్సి వస్తోందని, దీంతో రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు ప్రజలకు అసౌకర్యం, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు.అనుమతి లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోని పక్షంలో సంబంధిత యజమానులపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.క్యాతనపల్లి పట్టణ ప్రజలు పురపాలక సంఘం సూచనలను పాటిస్తూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

