September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*అసంక్రమణ వ్యాధుల నివారణకు ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం: జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు*

మంచిర్యాల,ఆగస్టు 29(నేటి ప్రజా తెలంగాణ):అసంక్రమణ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తూ, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయాలని జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ సూచించారు. అసంక్రమణ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆయన వివరించారు.అసంక్రమణ వ్యాధులు వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించవని, వీటి అభివృద్ధికి ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. ప్రారంభ దశలో చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవని, కొన్ని వ్యాధులకు దీర్ఘకాలికంగా, మరికొన్నింటికి జీవితకాలం చికిత్స అవసరమవుతుందని పేర్కొన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్ తదితరాలు ప్రధాన అసంక్రమణ వ్యాధులని తెలిపారు.వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ అసంక్రమణ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పురుషుల్లో ఈ వ్యాధులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, ప్రవర్తనలో మార్పులు చేసుకోవడం ద్వారా అసంక్రమణ వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు.అనారోగ్యకరమైన ఆహారం, అధిక ఉప్పు, జంక్‌ఫుడ్, ట్రాన్స్‌ఫ్యాట్ అధికంగా ఉండే పదార్థాల వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, పొగాకు, మద్యం వినియోగం వంటి అలవాట్లు అసంక్రమణ వ్యాధులకు దారితీసే అవకాశాన్ని పెంచుతాయని వివరించారు. స్థానికంగా, కాలానుగుణంగా లభించే తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని, పీచు పదార్థం అధికంగా ఉండే ముడి తృణధాన్యాలు, పప్పుధాన్యాలను తీసుకోవాలని సూచించారు. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించి, ప్రతిరోజూ తగినంత నీరు తాగాలని తెలిపారు.ప్రతిరోజూ శారీరక శ్రమ చేయడంతో పాటు యోగా, ధ్యానం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు. రక్తపోటు అధికంగా ఉన్నవారు వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవాలని, పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని సూచించారు. అసంక్రమణ వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యులు, వైద్య సిబ్బంది సూచనలను పాటిస్తూ మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలని జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన భీమారం మండలం యువకులు

*గ్రీవెన్స్ డేలో ప్రజల వినతుల స్వీకరణ.. చట్టపరంగా త్వరిత పరిష్కారానికి సీపీ ఆదేశాలు*

నస్పూర్‌లో ఆటో డ్రైవర్లకు షీ టీమ్స్ అవగాహన

Share this