మంచిర్యాల,ఆగస్టు 6:జిల్లాలో భూభారతి ఆపరేటర్లుగా ఎంపిక కాబడిన జూనియర్ సహాయకులు భూభారతి పోర్టల్ పై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు తో కలిసి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి పోర్టల్ వినియోగం, విధివిధానాలపై జూనియర్ సహాయకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి పోర్టల్ ద్వారా భూ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, సేవల వేగం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. శిక్షణలో బోధించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా నేర్చుకుని, పోర్టల్‌లోని అన్ని మాడ్యూళ్లపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా సకాలంలో పరిష్కరించి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. భూభారతి పోర్టల్ నిర్వహణలో ఖచ్చితత్వం, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రెవెన్యూ సేవల అమలులో ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో భూభారతి పోర్టల్‌లో దరఖాస్తుల నమోదు, పరిశీలన, డిజిటల్ ప్రాసెసింగ్, భూ రికార్డుల నిర్వహణ, వివిధ సేవల అమలు, సాంకేతిక అంశాలు, సమస్యల పరిష్కార విధానాలపై మాస్టర్ ట్రైనర్లు సమగ్ర అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్‌పాండే, రెవెన్యూ శాఖ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, వివిధ మండలాలకు చెందిన జూనియర్ అసిస్టెంట్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

