మంచిర్యాల, ఆగస్టు 6:హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించి, మాతా-శిశు మరణాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలపై ఆరోగ్య కార్యకర్తలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం రీ-ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, హైరిస్క్ గర్భిణులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు అందించడం ద్వారా మాతా, శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ప్రతి గర్భిణిని తప్పనిసరిగా నమోదు చేసి, సమయానుకూలంగా నాలుగు గర్భధారణ పరీక్షలు నిర్వహించడం, పోషకాహారం అందించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, ప్రసవానంతర సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ప్రసవం అనంతరం ఆశా, ఆరోగ్య కార్యకర్తలు ఇంటి సందర్శనలు నిర్వహించి తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత, శిశు టీకాలు, కుటుంబ నియంత్రణ, ప్రసవానంతర ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 108 అత్యవసర అంబులెన్స్ సేవలు, 102 మాతా-శిశు రవాణా సేవలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఉచిత వైద్య పరీక్షలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని సూచించారు.కమిషనర్ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్మాన్ ఎన్జీవోకు చెందిన డాక్టర్ కే. విద్యాసాగర్, డాక్టర్ పవన్ రెడ్డి శిక్షణ నిర్వహించారు. మొదటి విడతలో జిల్లాలోని 75 మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ అందించారు.శిక్షణలో హైరిస్క్ గర్భధారణకు దారితీసే ప్రధాన కారణాలైన చిన్న వయస్సులో లేదా 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం, అధిక లేదా తక్కువ బరువు, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, కవల గర్భం, గతంలో నెలలు నిండకముందే ప్రసవం, గత సిజేరియన్ ప్రసవం, ప్రసవానికి ముందు రక్తస్రావం, మూర్ఛవ్యాధి, క్షయ, మలేరియా, హెచ్ఐవీ, సిఫిలిస్, సికిల్ సెల్ అనీమియా, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు, గర్భంలో శిశువు ఎదుగుదల మందగించడం వంటి అంశాలపై ఆరోగ్య కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ (మాతా-శిశు సంరక్షణ) డాక్టర్ అరుణశ్రీ, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, డిపిహెచ్ఎన్ పద్మ, సీహెచ్వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, నాందేవ్, డీడీఎం ప్రవళిక, డీపీవో ప్రశాంతి, కార్యాలయ సూపరింటెండెంట్ విశ్వేశ్వర్ రెడ్డి, సూపర్వైజర్ వసుమతి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

