న్యూఢిల్లీ,ఆగస్టు 6:సహారా సంస్థలో పెట్టుబడులు పెట్టి ఏళ్లుగా తమ సొమ్ము కోసం ఎదురుచూస్తున్న డిపాజిటర్లకు న్యాయం చేయాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దేశవ్యాప్తంగా వచ్చిన సహారా డిపాజిటర్లు, ఏజెంట్లు, మద్దతుదారులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితులకు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి మాట్లాడిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, లక్షలాది కుటుంబాలు తమ కష్టార్జిత సొమ్ము కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూడాల్సి రావడం అత్యంత బాధాకరమని అన్నారు. డిపాజిటర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సహారా బాధితులకు వారి సొమ్ము త్వరితగతిన అందేలా కేంద్ర ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల కష్టార్జిత ధనాన్ని వారికి సకాలంలో తిరిగి అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, అన్యాయానికి గురైన ప్రతి వర్గానికి అండగా నిలవడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎంపీ పేర్కొన్నారు.ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరసనలో పాల్గొని తమకు మద్దతు ప్రకటించడం పట్ల సహారా బాధితులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధుల సహకారం కీలకమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

