తాండూర్,జూలై 24: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ దేవయ్య పుష్పగుచ్ఛం అందించి కమిషనర్‌కు స్వాగతం పలికారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించిన కమిషనర్ సర్కిల్ కార్యాలయ పనితీరును సమీక్షించారు.తనిఖీల సందర్భంగా సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ కేసుల పురోగతిని పరిశీలించారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను క్రమం తప్పకుండా సందర్శిస్తూ పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. సిబ్బంది విధి నిర్వహణను ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన మార్గదర్శకాలు అందించాలని తెలిపారు.భూ వివాదాలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా విచారించి చట్టబద్ధంగా దర్యాప్తు పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తులపై అనవసరంగా బలప్రయోగం చేయరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మేరకే చట్టబద్ధమైన బలాన్ని వినియోగించాలని సూచించారు.నేరాల నియంత్రణ కోసం రాత్రివేళల్లో ప్రివెంటివ్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. సమస్యలు తలెత్తకముందే గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.సీసీటీఎన్‌ఎస్, సమాచార సాంకేతికత (ఐటీ), ఆధునిక పోలీసింగ్‌లో వినియోగిస్తున్న సాంకేతిక వ్యవస్థలపై అన్ని స్థాయి అధికారులు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రతి అధికారి తమ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని తెలిపారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరిస్తూ చట్ట పరిధిలో సాధ్యమైనంత సహాయం అందించాలని సూచించారు. విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా వ్యవహరించి ప్రజలకు చట్టబద్ధంగా న్యాయం చేయడమే ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యత అని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.

