September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*అపార్ ఐడీ స్వచ్ఛందమే.. అడ్మిషన్లు, మార్క్స్ మెమోలు నిలిపివేయొద్దు: సుప్రీంకోర్టు*

న్యూఢిల్లీ,జూలై 20: విద్యార్థులకు జారీ చేస్తున్న APAAR (Automated Permanent Academic Account Registry) ఐడీపై సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. అపార్ ఐడీ నమోదు పూర్తిగా స్వచ్ఛంద ప్రక్రియ అని పేర్కొంటూ, ఆధార్ లేదా అపార్ ఐడీ లేదనే కారణంతో ఏ విద్యార్థికీ అడ్మిషన్ నిరాకరించడం, మార్క్స్ మెమోలు లేదా ఇతర విద్యాసంబంధిత పత్రాలను నిలిపివేయడం చట్టబద్ధం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.విద్యార్థుల వ్యక్తిగత సమాచారం, డేటా భద్రతకు సంబంధించిన పిటిషన్లను విచారించిన కోర్టు, విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా కేంద్ర విద్యాశాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అపార్ ఐడీ కోసం సమ్మతి తీసుకునే సమయంలో తల్లిదండ్రులు లేదా విద్యార్థులకు ‘ఆప్ట్-అవుట్’ (ఐడీ వద్దనుకునే) అవకాశం తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించింది. ఎలాంటి బలవంతం చేయరాదని స్పష్టం చేసింది.అలాగే విద్యార్థుల నుంచి సేకరించే వ్యక్తిగత, విద్యాసంబంధిత సమాచారాన్ని విద్యా అవసరాలకే పరిమితం చేయాలని, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించరాదని కోర్టు పేర్కొంది. డేటా గోప్యత, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.దేశంలోని ప్రతి విద్యార్థికి విద్య హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని గుర్తుచేసిన సుప్రీంకోర్టు, కేవలం అపార్ లేదా ఆధార్ ఐడీ లేదనే కారణంతో అడ్మిషన్లు, పరీక్షా ఫలితాలు, మార్కుల మెమోలు లేదా ఇతర విద్యాసేవలను నిరాకరించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్–వన్ స్టూడెంట్ ఐడీ’ భావనతో అపార్ వ్యవస్థను అమలు చేస్తోంది. విద్యార్థి విద్యా ప్రగతి, మార్కులు, సర్టిఫికెట్లు, నైపుణ్యాలకు సంబంధించిన వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరచడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే డేటా గోప్యతపై వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.ఈ తీర్పుతో అపార్ ఐడీ పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడాన్ని అరికట్టే అవకాశం ఏర్పడింది. విద్యార్థుల హక్కులను పరిరక్షించే దిశగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు.

Related posts

జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామీకం.

*హెపటైటిస్ నివారణకు అప్రమత్తతే రక్షణ.. ప్రపంచ హైపటైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన ర్యాలీ*

Chief Editor: Satish Kumar

*కానిస్టేబుల్‌పై దాడి.. బీట్‌ కానిస్టేబుల్‌ సస్పెండ్‌*

Share this