September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరం: తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు*

సూర్యాపేట, జూలై 19: మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ సభ్యుడు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.ఆదివారం సూర్యాపేటలో మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల వినియోగాన్ని జీరో స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ క్రమంలో పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో దాడులు, తనిఖీలు నిర్వహిస్తోందని చెప్పారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు అందించాలని, ప్రజల సహకారంతోనే ఈ సామాజిక సమస్యను పూర్తిస్థాయిలో అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.దేశం,రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్ర అత్యంత కీలకమని అన్నారు. విధుల నిర్వహణలో ప్రజల హక్కులకు భంగం కలగకుండా పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులపై ఆధారాలతో ఫిర్యాదులు అందినట్లయితే పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ విచారణ జరిపి తగిన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తుందని వివరించారు. సుపరిపాలన, పారదర్శక పాలన ప్రజలకు అందేలా ప్రతి వ్యవస్థ పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.అనంతరం సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లుకు పలు ప్రజా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం–2005 సమర్థ అమలుతోనే అవినీతిని నియంత్రించడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని తమ హక్కులను సమర్థంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఇదే పర్యటనలో పట్టణంలోని ట్రిపుల్ ఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన అర్థశాస్త్ర అధ్యాపకుడు, శ్రీచైతన్య విద్యాసంస్థ మాజీ ప్రధానోపాధ్యాయుడు కాసా రామ్మూర్తి దశదిన సంస్మరణ కార్యక్రమంలో డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యా రంగానికి కాసా రామ్మూర్తి అందించిన సేవలను స్మరించుకున్నారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ యరమాద కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకట్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గుంతకండ్ల ముకుంద రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ముస్కుల గోవిందా రెడ్డి, రావుల రాంబాబు, నియోజకవర్గ అధ్యక్షుడు బంగారు శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పిడమర్తి ఉపేందర్, కాసా శారద, కాసా స్నేహిత,కాసా హర్షిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో హిందూ స్మశానవాటికకు భూమి పూజ

*ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు… రోడ్డు ప్రమాదాల నివారణకు జైపూర్ పోలీసుల చర్యలు*

Share this