మంచిర్యాల,జూన్ 28:మంచిర్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా వైద్య ఆరోగ్యశాఖ, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా 459 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా 76,367 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమం కోసం 1,836 మంది వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలు, ఎన్జీవో ప్రతినిధులు సేవలు అందించగా, 70 వాహనాలను వినియోగించడం జరిగిందని తెలిపారు.ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించేందుకు మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి పల్స్ పోలియో కార్యక్రమం పర్యవేక్షణకు సంబంధించిన వివరాలను సూపర్‌వైజర్లు, వైద్యాధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, మందుల నిల్వ కేంద్రాలు, క్రిటికల్ కేర్ సేవలను బలోపేతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ఆరోగ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, డాక్టర్ సుధాకర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అనిల్, డాక్టర్ అరుణ శ్రీ, వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

