రామకృష్ణాపూర్,అక్టోబర్ 17(నేటి ప్రజా తెలంగాణ):రామకృష్ణాపూర్ పరిధిలోని తవక్కల్ విద్యాసంస్థల్లో అనుమతులు లేకుండా పదో తరగతి తరగతులు నిర్వహిస్తున్నారని, విద్యార్థులను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను ప్రశ్నించేందుకు వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులపై పాఠశాల చైర్మన్ దుర్భాషలాడుతూ, భౌతిక దాడికి యత్నించారని నాయకులు ఆరోపించారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారనే విషయాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా చైర్మన్ అహంకారపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. మంత్రి వెంకటస్వామి పేరు ప్రస్తావిస్తూ రాజకీయ అండదండలతో బెదిరింపులకు పాల్పడటం సరికాదని అన్నారు. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో, మానసిక ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ, పోలీసు అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.విద్యార్థి సంఘాల నాయకులపై దుర్భాషలాడి, దాడికి యత్నించిన చైర్మన్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్, పీడీఎస్‌యూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్, ఏఐఎస్‌బీ జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

