మంచిర్యాల,అక్టోబర్ 14(నేటి ప్రజా తెలంగాణ):ఉద్యోగులు,విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రుల యాజమాన్యాలు తగిన సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎంప్లాయిస్ జాక్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని వసుధ ఆసుపత్రి, వైష్ణవి డెంటల్ ఆసుపత్రులను బుధవారం సందర్శించి పథకం అమలు తీరును పరిశీలించారు. ఆసుపత్రుల్లో ఉద్యోగులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్సా సదుపాయాలపై వైద్యులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో 16 ప్రైవేట్ ఆసుపత్రులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పరిధిలో సేవలు అందిస్తున్నాయని తెలిపారు. అర్హులైన ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఆరోగ్య కార్డుల ద్వారా ఉచిత వైద్య సేవలు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పథకం లక్ష్యం నెరవేరేలా ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. వసుధ ఆసుపత్రిలో మేనేజ్మెంట్ ప్రతినిధి నరసింహులుతో, వైష్ణవి డెంటల్ ఆసుపత్రిలో డాక్టర్ పేర్ల నాగార్జున, డాక్టర్ వైష్ణవితో మాట్లాడి సేవల వివరాలను తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పున్నం మల్లయ్య, నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్లు సత్యనారాయణ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

