రామకృష్ణాపూర్, అక్టోబర్ 13 (నేటి ప్రజా తెలంగాణ): పేద ప్రజల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన నాయకుడు కామ్రేడ్ గుండా మల్లేష్ అని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు.రామకృష్ణాపూర్‌లోని సీపీఐ కార్యాలయంలో గుండా మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్, సీపీఐ పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా గళమెత్తడంతో పాటు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గుండా మల్లేష్ నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. అన్యాయాలకు ఎదురు నిలిచి, ప్రజల హక్కుల సాధన కోసం నిస్వార్థంగా పోరాడిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ప్రజా ఉద్యమాల పట్ల ఆయన చూపిన నిబద్ధత, నిరాడంబర జీవనశైలి, పోరాట పటిమ కమ్యూనిస్టు ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. గుండా మల్లేష్ ఆశయాలను కొనసాగిస్తూ పేదల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం కమ్యూనిస్టు శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కామ్రేడ్ గుండా మల్లేష్‌కు విప్లవ జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, మామిడి గోపి, మిట్టపెల్లి పౌల్, నక్క వెంకటస్వామి, కాదండి సాంబయ్య, మున్సిపాలిటీ కౌన్సిలర్లు కౌడగాని సాంబయ్య, మద్దెల శంకర్, మీనుగు ముని, సీపీఐ నాయకులు మాదాసు శంకర్, ముటుకుల రాజు, తోకల రాజన్న, రాంపెల్లి రాజన్న, కుర్మా రమేష్, ముకుంద రెడ్డి, కారుకూరి రాయలింగు, చిరంజీవి, సందనవేణ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

