రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 29 (నేటి ప్రజా తెలంగాణ): ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీహెచ్‌పీ రామకృష్ణాపూర్‌లో మంగళవారం హృదయ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డివైసీఎంవో మధుకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికులకు గుండె ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా డివైసీఎంవో మధుకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటు మద్యం, పొగాకు, ధూమపానానికి దూరంగా ఉండాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకొని తగినంత నిద్ర పాటించాలని తెలిపారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు మందులను నిర్ణీత సమయంలో క్రమం తప్పకుండా వాడటం ద్వారా గుండెపోటు ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు.సీఎంవో డాక్టర్ కిరణ్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో, మందమరి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ సహకారంతో కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు పలు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కార్మికులు అడిగిన ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు డివైసీఎంవో మధుకుమార్, డాక్టర్ రాజ్‌కుమార్ వివరంగా సమాధానాలు అందించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఇంజనీర్ ఏ. చంద్రమౌళి, డాక్టర్ రాజ్‌కుమార్, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి హరిప్రసాద్, పారిశుధ్య తనిఖీ అధికారి శ్రీనివాస్, వైద్య ఆరోగ్య సిబ్బంది, సీహెచ్‌పీ కార్మికులు పాల్గొన్నారు.

