క్యాతన్‌పల్లి,సెప్టెంబర్ 29(నేటి ప్రజా తెలంగాణ):పోలీసు బందోబస్తు మధ్య జరిగిన క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పనితీరుపై పలువురు కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆయనను వెంటనే బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. దీనిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని పేర్కొన్నారు.మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ కూడా సక్రమంగా సాగడం లేదని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు నెలకొంటున్నా సంబంధిత అధికారులు తగిన స్థాయిలో స్పందించడం లేదని అన్నారు. ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులు, మున్సిపల్ సేవలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు.ఈ కౌన్సిల్ సమావేశంలో సభ్యుల అభ్యంతరాలు, ఆరోపణలపై చర్చ జరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి పరిస్థితిని పరిశీలించాలని, సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు కమిషనర్ వ్యవహారశైలిపై తగిన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు కోరారు.
previous post

