మంచిర్యాల,సెప్టెంబర్ 28 (నేటి ప్రజా తెలంగాణ):మాదకద్రవ్యాలు,మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితానికి పునాదులు వేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ విద్యార్థులు, యువతకు పిలుపునిచ్చారు. నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రభుత్వ బాలుర పాఠశాలలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిల్‌తో కలిసి విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, అవగాహన పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు ఆరోగ్యంతో పాటు కుటుంబ, సామాజిక జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగంతో శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, జీర్ణ సమస్యలు, ఆకలి మందగించడం, వికారం, వాంతులు, తలనొప్పి, మైకం, మలబద్ధకం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారిలో ప్రవర్తనా మార్పులు చోటుచేసుకోవడంతో పాటు ప్రమాదకర నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడి కుటుంబ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు.గుట్కా, పొగాకు, ఖైనీతో పాటు ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులతో పాటు కళాశాల విద్యార్థులకు నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు తాము దూరంగా ఉండటంతో పాటు ఇతరులను కూడా వాటికి దూరంగా ఉండేలా ప్రోత్సహించి, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, సీహెచ్‌వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, నాందేవ్ శ్రీనివాస్, ఆర్బీఎస్కే వైద్యులు, జిల్లా ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేష్, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
previous post

