రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 16 (నేటి ప్రజా తెలంగాణ):రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న సీపీకి సీఐ రమేష్, ఎస్‌ఐ శ్రీధర్ మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీపీ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు.స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యారక్, రిసెప్షన్ కేంద్రం, రికార్డులను పరిశీలించిన సీపీ పరిశుభ్రత, 5ఎస్ విధానం అమలు, వాహనాల క్రమబద్ధ నిర్వహణపై సూచనలు చేశారు. సీసీటీఎన్‌ఎస్ ద్వారా కేసుల వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియను పరిశీలించారు. పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలు, గస్తీ, కనిపించేలా పోలీసింగ్ తదితర అంశాలపై ఎస్‌ఐను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో మర్యాదగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించి వారి సమస్యలను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. హైవే, రైల్వే స్టేషన్, కొత్త కాలనీలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలు, రహదారి భద్రత, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. రైలు, రోడ్డు మార్గాల ద్వారా జరిగే గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెంచాలని ఆదేశించారు.ప్రజల భాగస్వామ్యంతో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో ఆస్తి నేరాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధిస్తున్న సిబ్బందిని సీపీ అభినందించారు. కొత్త కాలనీల్లో వృద్ధుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ బ్లూకోట్స్ సిబ్బంది క్రమం తప్పకుండా పర్యటించాలని, వృద్ధుల భద్రతకు ప్రత్యేక కార్యాచరణ విధానం అమలు చేయాలని సూచించారు. పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు స్టేషన్ నిర్వహణపై శ్రద్ధ వహించాలని తెలిపారు.రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ నిర్వహణ బాగుందని పేర్కొంటూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ తనిఖీలో సీఐ రమేష్, ఎస్‌ఐ శ్రీధర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

