మంచిర్యాల,సెప్టెంబర్ 6(నేటి ప్రజా తెలంగాణ): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో వినాయక చవితి మండపాల ఏర్పాట్లు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అధ్యక్షత వహించారు.వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రేమ్‌సాగర్‌రావు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.మండపాల వద్ద పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.మండపాల నిర్వాహకులకు అవసరమైన సహకారం అందించాలని, మండపాల కమిటీ సభ్యులు కూడా అధికారులతో సమన్వయంగా వ్యవహరించి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సింగరేణి ప్రధాన అధికారి శ్రీనివాస్, సహాయ పోలీసు కమిషనర్ ప్రకాశ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా ఆర్‌జీపీఆర్‌ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ మాజీ చైర్మన్ మంగిలాల్, గుండ సుధాకర్, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

