September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*డ్రోన్ నిఘాతో అక్రమాలకు చెక్‌.. బహిరంగ మద్యపానంపై కొరడా*

మంచిర్యాల,ఆగస్టు 20(నేటి ప్రజా తెలంగాణ): ప్రజలకు ప్రశాంతమైన, సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణం, నస్పూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక డ్రోన్ నిఘా ఆపరేషన్ నిర్వహించారు. మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో బహిరంగ మద్యపానం, ఈవ్‌టీజింగ్, అనుమానాస్పద సంచారం, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.పాఠశాలలు, కళాశాలలు, బాలికల వసతి గృహాలు, గోదావరి నదీ తీర ప్రాంతాలు, మైదానాలు తదితర సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా చేపట్టారు. రాజీవ్‌నగర్‌లోని గర్ల్స్ మోడల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ పరిసరాలు, ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతం, కాలేజీ రోడ్డు, గోదావరి నది తీర ప్రాంతాలతో పాటు మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ విజువల్స్‌ను పరిశీలించారు.డ్రోన్ నిఘాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 13 మందిని గుర్తించి అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈవ్‌టీజింగ్‌, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారితో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, బాలికల వసతి గృహాలు, మహిళలు, విద్యార్థినులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్‌, వేధింపులు, వెంబడించడం వంటి చర్యలను పోలీసులు ఏమాత్రం సహించబోరని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం మత్తులో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, అసభ్యంగా ప్రవర్తించడం, గొడవలకు పాల్పడటం, మహిళలు, విద్యార్థినులను వేధించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరని డీసీపీ తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంతో పాటు నస్పూర్, శ్రీరాంపూర్ పరిధిలోని సున్నిత ప్రాంతాలు, విద్యాసంస్థలు, బాలికల వసతి గృహాల పరిసరాలు, నదీ తీరాలు, మైదానాల్లో ప్రత్యేక డ్రోన్ నిఘా నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజల భద్రత, మహిళలు, విద్యార్థినుల రక్షణకు పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మంచిర్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

*జ్యువెలరీ దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: ఎస్‌ఐ జే. శ్రీధర్*

శాంతిగని గని‌లో ఏఐటీయూసీ పరిశీలన

స్థానికుల సంక్షేమం, భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు

Share this