రామకృష్ణాపూర్, ఆగస్టు 20: దొరికిన విలువైన మొబైల్ ఫోన్‌ను సొంతం చేసుకోకుండా పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి 80 ఏళ్ల వృద్ధుడు నిజాయితీని చాటుకున్నారు. రామకృష్ణాపూర్ శ్రీనివాస్ నగర్‌కు చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి పురం శెట్టి కనకయ్యకు మొబైల్ ఫోన్ దొరకడంతో దానిని యజమానికి చేరేలా చేయాలనే ఉద్దేశంతో రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అప్పగించారు.ఈ వయసులోనూ సామాజిక బాధ్యతతో వ్యవహరించి, దొరికిన వస్తువు తనది కాదని భావించి పోలీసులకు అప్పగించడం అభినందనీయమని స్థానిక ఎస్సై జె. శ్రీధర్ తెలిపారు. కనకయ్య చూపిన నిజాయితీ, నైతిక విలువలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని ఆయన కొనియాడారు.దొరికిన వస్తువును యజమానికి చేర్చేందుకు బాధ్యతగా వ్యవహరించిన కనకయ్యను ఎస్సై జె. శ్రీధర్ అభినందించారు. ఇలాంటి నిజాయితీ గల పౌరుల వల్ల సమాజంలో నమ్మకం, మానవత్వం మరింత బలపడుతాయని పేర్కొన్నారు.“దొరికినది మనది కాదు.. నిజమైన యజమానికి చేర్చడమే నిజమైన మానవత్వం” అనే సందేశాన్ని కనకయ్య తన చర్య ద్వారా చాటిచెప్పారు.

