రామగుండం, ఆగస్టు 18(నేటి ప్రజా తెలంగాణ): వీఐపీ భద్రతా విధుల్లో ఉన్న పీఎస్ఓలు అప్రమత్తత, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. సీపీ ఆదేశాల మేరకు మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో పీఎస్ఓలకు వీఐపీ భద్రతపై సంక్షిప్త శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పీఎస్ఓలు శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మంచి అలవాట్లు, నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. ప్రజలతో నేరుగా సంబంధం కలిగిన పీఎస్ఓలు అవినీతి, అక్రమ ప్రయోజనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.వీఐపీ భద్రతలో అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను నిశితంగా పరిశీలిస్తూ పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద కదలికలు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, సామాజిక మాధ్యమాల్లో అనధికారికంగా పంచుకోరాదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో శాఖా నియమావళికి అనుగుణంగా ప్రశాంతంగా, వేగంగా స్పందించాలన్నారు. కవాతు సాధన, నిరంతర శిక్షణతో విధి నిర్వహణలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.ఈ శిక్షణలో భద్రతా విధులు, శారీరక దారుఢ్యం, అప్రమత్తత, సమాచార మార్పిడి, సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన, సమాచార గోప్యత తదితర అంశాలపై పీఎస్ఓలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, రమేష్, ఆర్ఐలు శేఖర్, దామోదర్, రమేష్, మల్లేశం, సీసీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

