September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*సైబర్‌ మోసాలకు అత్యాశ.. భయమే ఆయుధం.. అప్రమత్తతతోనే రక్షణ: డీసీపీ ఏ. భాస్కర్*

చెన్నూర్, ఆగస్టు 13: సైబర్‌ నేరాల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సురక్షా కా తిరంగా – సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ వైపు” కార్యక్రమంలో భాగంగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చెన్నూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెన్నూర్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కళాశాలలో సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ ఏ. భాస్కర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్‌లో ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, ఉద్యోగ సంబంధిత సమాచారం, వ్యక్తిగత ఫొటోలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఉంటుందని, ఇవి సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కితే దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సైబర్‌ నేరగాళ్లు ప్రధానంగా అత్యాశ, భయాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసుల పేరుతో అరెస్ట్ చేస్తామని బెదిరించడం, పిల్లలు నేరంలో చిక్కుకున్నారని చెప్పి భయపెట్టడం, లాటరీలు, భారీ లాభాల పేరుతో ఆశ చూపించడం వంటి పద్ధతులను అనుసరిస్తున్నారని వివరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని అందించడం ద్వారా సైబర్‌ నేరగాళ్లకు అవకాశం కల్పించినట్లవుతుందని సూచించారు. రూ.1,000 పెట్టుబడితో నెలలో రూ.3,000 లాభం వంటి అసాధారణ ఆఫర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. సైబర్‌ భద్రత విషయంలో ముందస్తు జాగ్రత్తలే అత్యంత కీలకమని పేర్కొంటూ, సైబర్‌ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తే నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే 1930కు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సాంకేతికతను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బెల్లంపల్లి రోడ్ల దుస్థితి

Chief Editor: Satish Kumar

*ఎమ్మెల్యే చేతుల మీదుగా ల్యాప్ టాప్ అందజేత*

గాలి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్*

Chief Editor: Satish Kumar
Share this