హాజీపూర్,జూన్1:మంచిర్యాల జిల్లా కేంద్రం నమ్నూర్,గుడిపేట గ్రామాలలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలు,జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ఖాళీ చేశారు.రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించడం ద్వారా రైతులకు సకాలంలో ఉపశమనం కల్పించారు.రైతులకు న్యాయమైన ధర అందించడంతో పాటు వారి కష్టానికి తగిన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా నమ్నూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో మొత్తం 128 మంది రైతుల నుండి 18,624 బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా,దాదాపు 7,449.60 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించడం జరిగింది.దీంతో కేంద్రంలోని ధాన్యం మొత్తం ఖాళీ అవడం జరిగింది.అలాగే గుడిపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో 151 మంది రైతుల నుండి 22,000 బస్తాల ధాన్యం సేకరించగా,సుమారు 8,800 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది.కేంద్రం పూర్తిగా ఖాళీ కావడంతో రైతులు,ప్రజాప్రతినిధులు,అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ,ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తమ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి మిల్లులకు తరలించడంపై ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్,మెప్మా సిఓ అరుణ,ఆర్పీలు లక్ష్మణ్,విజయ,పద్మ,ఓబిలు పద్మ ,మల్లేశ్వరి,పిడి సుభాష్,టిఎంసి చంద్రయ్య లకు కృతజ్ఞతలు తెలిపారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని,భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సహాయ సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.

